Wednesday, April 8, 2009

"పెళ్ళి చేసుకుని ప్రకాశించవోయ్ ప్రకాశం" నవ్వుతూ అన్నాడు ఆదిత్య.

"ఇవాళ పొద్దునే వచ్చి వాయిస్తున్నారేమిటండీ బావగారూ"

"నీ పెళ్ళి మా చావు కొచ్చిందేమిట్రా" అందుకుంది సరళ.

"అంత మాట అనేసావేమిటే అక్కా"

"లేకపోతే ఏమిట్రా? నీ పెళ్ళి చూడాలని కలవరించి, కలవరించి బకెట్టు తన్నేసింది బామ్మ. ప్రకాశం పప్పన్నం పెట్టడేమిటే అంటూనే పైకెళ్ళిపొయింది అమ్మమ్మ. దీనితో కంగారు పడి టపా కట్టేసారు తాతయ్యలు. అందరూ పోయాక గాని పెళ్ళి చేసుకోవా?"

"పెళ్ళి చేసుకోవాలనే కదే ఇన్ని పెళ్ళి చూపులు చూసాను" అన్నాడు ప్రకాశం.

"మరెందుకు చేసుకోలేదు" ఆశ్చర్యం నటిస్తూ నిలదీసాడు ఆదిత్య.

"వాడికో పట్టాన ఎవరూ నచ్చరండీ అల్లుడుగారూ. ఎక్కడైనా ఆడపిల్లకి పెళ్ళి చేయాలంటే చెప్పులరిగేలా తిరుగుతారు. మీ బావమరిదికి పెళ్ళి చేయడానికి మీ మామగారు చెప్పులరిగేలా తిరిగి, విసిగిపోయి, ఇక నావల్ల కాదని చేతులెత్తేసారాయన" అంది కాఫీలు తీసుకొచ్చిన అన్నపూర్ణ.

"బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా యూజ్‌ లెస్సోయ్. ఏదైనా లవ్ ఎఫైర్ ఉందా?" చెప్పమన్నట్లు చూసాడు ఆదిత్య.

"అదేం లేదండీ బావగారూ. నాకు నచ్చాలి కదా!" అంతేనన్నట్లు నవ్వుతూ చెప్పాడు ప్రకాశం.

"వీడి మేనమామ కూతురు లలితకి ఏం లోటు చెప్పండి. చక్కగా వంటావార్పూ వచ్చు. వీడిని పెళ్ళిచేసుకోవాలని ఆ అమ్మాయి ముచ్చట పడింది. వీడు ససేమిరా అంటే సంబంధాలు చూడలేక చచ్చాను. వీడికి పెళ్ళయ్యే యోగమున్నట్లు లేదు" తన ఆవేదన వెలిబుచ్చాడు అప్పుడే అక్కడ కొచ్చిన విశ్వనాథం మాష్టారు.

"వీడు అమ్మాయి ఎర్రగా వుంటే ఎర్రగా ఉందంటాడు. నల్లగా ఉంటే నల్లగా ఉందంటాడు. పొడుగ్గా ఉంటే పొడుగ్గా ఉందంటాడు. పొట్టిగా ఉంటే పొట్టిగా ఉందంటాడు. ఆటలొచ్చా పాటలొచ్చా అంటాడు. అన్నిటికీ మించి ఘుమఘుమలాడేలా వంటలొచ్చా అంటాడు. ఇంక వీడికి పెళ్ళెక్కడౌతుంది" నిష్ఠూరంగా అంది సరళ.

"అమ్మాయి ఎట్లా ఉంటే నీకు నచ్చుతుందోయ్ ప్రకాశం" ఆసక్తిగా అడిగాడు ఆదిత్య.

"మీరు నవ్వ కూడదు"

"నవ్వనులే చెప్పు"

"ఇప్పటి అమ్మాయిలకు వంటలు రావండీ. నాకేమో రుచులు కావాలి"

"ఇప్పటి అమ్మాయిలు వంటలెలా చేస్తారంటావ్"

"ఏముందండీ ప్రెషర్ కుక్కర్ తీసుకొచ్చి, ఒక గిన్నెలో బియ్యం, ఒక గిన్నెలో పప్పు, ఒక గిన్నెలో కూరలు మొదలైనవి పెట్టి స్టవ్ మీద పడేస్తారు. టివీ చూడటం మీద ఉన్న ధ్యాస వంట మీద ఉండదు. అవి లేహ్యంలా తయారయి రుచీపచీ ఉండవు. పచ్చళ్ళేమో మిక్సీలో తిప్పేస్తారు. అవీ బాగోవు. మజ్జిగ చేయడానికి కూడా వీళ్ళకి బద్ధకం"

"అయితే వంటలెలా ఉండాలంటావ్"

"మా బామ్మలా వంకాయ పచ్చడి చెయ్యాలి. మా అమ్మమ్మలా పప్పు పులుసు పెట్టాలి. మా అమ్మలా కూరలు చెయ్యాలి"

"అమ్మాయి ఇంకా ఎట్లా ఉండాలంటావ్"

"మా అక్కలా పాటలు పాడాలి. మా పిన్నిలా నాట్యం చేయాలి. అందంగానూ ఉండాలి."

"ఓ.కే., ఓ.కే., అట్లాంటి అమ్మాయి ఉంది చేసుకుంటావా?"

ఎగిరి గంతేసి గ్రీన్ సిగ్నలిచ్చాడు మాస్టర్ ప్రకాశం.

* * *

మూర్తిగారు, సరస్వతమ్మలు వాళ్ళమ్మాయి కుసుమ పెళ్ళిచూపుల సీన్‌లో మౌన పాత్రలు పోషిస్తున్నారు. విశ్వనాథంగారు, అన్నపూర్ణమ్మల పరిస్థితీ అంతే.

"ప్రకాశం! కుసుమని చూపించారుగా, మీరిద్దరూ మాట్లాడుకోండి" సరళ పలకరింపుతో ఈ లోకంలోకి వచ్చాడతను. కుసుమ చామనచాయైనా సాంప్రదాయబద్ధంగా ఉందనుకున్నాడు ప్రకాశం.

"మీ అభిరుచులేమిటి కుసుమ గారూ"

"పాటలు, నాట్యం..."

"మీకు వంటలవీ వచ్చా" సందేహం.

"నాకు చాలా రుచులు తెలుసండీ" చిరునవ్వు.

"మీకేవి ఇష్టం"

"వంకాయ పచ్చడి, పప్పు పులుసు, పాఠోళీ, పూర్ణం బూరెలు"

"టిఫిన్ల సంగతేమిటి?"

"ఆయిల్ దోశ, ఆయిల్ లెస్ దోశ, స్టీం దోశల్లో మెత్తగా వెన్నలా ఉండి, నోట్లో వేసుకుంటే కరిగి పోతుందే! ఆవిరి దోశ. అది నా స్పెషల్ ఐటం"

"కాఫీ సంగతి?"

"బ్లెండెడ్ కాఫీ, ఫిల్టర్ కాఫీ, ఇన్‌స్టెంట్ కాఫీల్లో ఫిల్టర్ కాఫీ ఇష్టం"

"టీ సంగతి?"

"బ్లాక్ టీ, మిల్క్‌టీ, లెమన్ టీ, జింజర్ టీలలో మిల్క్ టీ ఇష్టం"

అన్నీ తనకు ఇష్టమైనవే కుసుమ చెబుతూండడంతో ప్రకాశం ఉబ్బిపోయాడు.

"నేను కూడా మిమ్మల్ని ఏమైనా అడగొచ్చాండీ" మెల్లగా అంది కుసుమ.

"భలేవారే, అడగండి" స్వాగతించాడు ప్రకాశం.

"నేను ఉద్యోగాలు చేసి ఊళ్లు ఏలాలంటారాండీ" అమాయకంగా అడిగింది కుసుమ.

"నో...నో... హౌస్ వైఫ్‌గా ఉంటే చాలు" తృప్తిగా సమాధానమిచ్చాడు ప్రకాశం.

అందరూ ఈజీగా ఫీలయి, ముసి ముసి నవ్వులు నవ్వుకుంటున్నారు.

"ప్రకాశిస్తావటోయ్ ప్రకాశం"

తలదించుకుని సిగ్గు పడ్డాడు ప్రకాశం.

ఔను, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్ళి సందడి మొదలైంది.


* * *

"కాపురం... కొత్త కాపురం" కూనిరాగాలు తీస్తున్న ప్రకాశం, కుసుమ ఏం చేస్తుందోనని తొంగి చూశాడు. పడక కుర్చీలో కునికిపాట్లు పడుతోందామె మొదటి రోజే.

"ఏం డియర్, ప్రయాణ బడలిక తీరలేదా?"

"కొంచెం కాఫీ పెట్టిద్దురూ" నీరసంగా అంది కుసుమ.

"ఈల వేసుకుంటూ వెళ్ళిన ప్రకాశం కాఫీ కప్పుతో వచ్చి కుసుమకి అందించాడు.

"మీరు కాఫీ చక్కగా కలిపారండీ" మెచ్చుకోలుగా అందామె.

"ప్రకాశమంటే ఏంటనుకున్నావు" కాలరెగరేసాడు.

"మీ చేతి వంట రుచి చూపించరూ" గారాంగా అడిగింది.

"ఓ. యస్!" అనేశాడు తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని చూపించుకునేందుకు గొప్ప అవకాశంగా భావించిన ప్రకాశం.

నడుం వాల్చి వీక్లీ చదువుకుంటున్న కుసుమకు వంటింట్లోంచి వస్తున్న ఘుమఘుమలు నోరూరించాయి.

"మై డియర్ హస్బెండూ వంట అద్భుతంగా ఉంది. కూరకు కూర, పచ్చడికి పచ్చడి అదిరిపోయాయి. ఇంత బాగా రసం పెట్టడం ఎట్లా తెలిసిందండీ" ప్రకాశాన్ని ములగ చెట్టు ఎక్కిస్తోంది కుసుమ.

గాల్లో తేలిపోతున్న ప్రకాశం, ఇంకా తనకున్న రెండు రోజుల సెలవులు గుర్తొచ్చి, రెండు రోజులూ తానే వంట చేస్తాననీ, అప్పుడు చూడమనీ గొప్పలు పోయాడు.

కుసుమ కిలకిలా నవ్వింది. ప్రకాశం మెలికలు తిరిగి పోయాడు.

* * *

"వంట చెయ్యాలంటే మీరే చెయ్యాలండీ" ప్రకాశాన్ని ఆకాశానికి ఎత్తేసింది కుసుమ.

"నల భీమ పాకాలన్నట్లు ప్రకాశ పాకం అనాల్సిందేనండీ"

"వంట చెయ్యడంలో మగవాళ్ళ ముందు ఆడవాళ్ళు దిగదుడుపే ననుకోండి"

"నలపాకం, భీమపాకం అంటారు గానీ, సీతపాకం, సావిత్రిపాకం అంటారా చెప్పండి"

"ప్రకాశపాకంతో నలభీమ పాకాలు వెనుకబడి పోతాయేమో నండీ" భయం నటించింది.

ప్రకాశం ఫ్లాటయి పోయాడు. కిసుక్కున నవ్వింది కుసుమ.

రొమ్ము విరుచుకుని రోజూ తనే గరిట తిప్పుతున్నాడు ప్రకాశం.

డ్యూయెట్ల మీద డ్యూయెట్లు పాడేసుకుంటున్నారిద్దరూ.

* * *

ఒకరోజు స్టవ్ మీద నుంచి గిన్నె దింపుతుంటే ప్రకాశం చెయ్యి కాలింది. అప్పుడు అతని బుర్రలో ట్యూబ్‌లైట్ వెలిగింది.

"కుసుమా! కుసుమా!!"

"పిలిచారాండీ"

"నన్ను బోల్తా కొట్టించి, రోజూ నాచేత వంట చేయిస్తావా?"

"నేను మిమ్మల్ని బోల్తా కొట్టించానాండీ" అమాయకంగా అంది.

"లేదు నేనే బోర్లా పడ్డాను. ఇక నువ్వే వంట చెయ్యాలి"

"నాకు రాదు కదండీ" ప్రశ్నార్థకంగా చూసింది.

"పెళ్ళి చూపుల్లో నీకు వంటలవీ వచ్చా అంటే రాదని చెప్పావా?"

"నాకు చాలా రుచులు తెలుసన్నాను గానీ వంటలు వచ్చు అనలేదు గదండీ"

"అంతా మోసం" జుట్టు పీక్కున్నాడు ప్రకాశం.

"నా మరదలు లలితను కాదన్నందుకు నాకీ శాస్తి జరగాల్సిందే. లలితా! నిన్ను పెళ్ళి చేసుకోనందుకు నన్ను క్షమిస్తావు కదూ!"

"నన్ను వంటవాడిని చేసేసావా కుసుమా! చెప్పు కుసుమా!" నాటకీయంగా డైలాగులు చెప్పేస్తున్నాడు ప్రకాశం.

"నేను వంట నేర్చుకోనాండీ" చిన్నపిల్లలా ముద్దు మాటలతో అడిగింది కుసుమ.

చిందులు తొక్కుతూ వంటింట్లోకి వెళ్ళిన ప్రకాశాన్ని చూసి నవ్వాపుకుందామె.

* * *

ఆరోజు డ్యూటీ సరిగా చెయ్యలేక పోయాడు ప్రకాశం. భారంగా అడుగులు వేసుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. లోపల వాళ్ళక్క సరళ, బావ ఆదిత్య టీవీ సీరియళ్ళు ఎలా సాగుతున్నాయో జోకులు వేసుకుంటూ టిఫిన్లు చేస్తున్నారు.

నాలుగు ప్లేట్లల్లో కరివేపాకు పకోడి, తమలపాకు పకోడి, క్యాబేజీ పకోడి, ఉల్లి పకోడి ఉన్నాయి. అందంగా ముస్తాబైన కుసుమ నవ్వులు చిందిస్తూ వారికి సెర్వ్ చేస్తోంది.

"ఏలకుల టీ చాలా బాగుంది" అంటోంది సరళ.

"అక్కాబావగార్లకు నమస్కారం. ఎంతసేపయింది మీరొచ్చీ" హుషారు తెచ్చుకుంటూ పలకరించాడు ప్రకాశం.

"ఎట్లా ఉందోయ్ మీ కొత్త కాపురం. ఒకసారి చూసి పోదామని వచ్చాం" నవ్వుతూ అన్నాడు ఆదిత్య.

"మా మరదలు చేసి పెట్టే రుచులు చూసాక, మనల్ని మరచి పోయుంటాడండీ" మాట కలిపింది సరళ.

"అదేం లేదు. కుసుమకు వంట రాదుట కదా!" నీళ్ళు నమిలాడూ ప్రకాశం.

"సరదాగా నిన్ను ఆట పట్టించి ఉంటుంది. ఇవన్నీ కుసుమ చేసినవే"నన్నారు ఆదిత్య, సరళలు.

ప్రకాశం వైపు చిలిపిగా చూసి, కళ్ళెగరేసింది కుసుమ.

ఆశ్చర్యపోవడం ప్రకాశం వంతైంది.

[రమ్యభారతి సాహిత్య త్రైమాసిక ఫిబ్రవరి- ఏప్రిల్ 2007 సంచికలో ప్రచురితం.]